గుంటూరులోని ఆ లేఅవుట్లలో ప్లాట్లు, ఇళ్లు తీసుకోవద్దు- మున్సిపల్ కమిషనర్ - UNAUTHORIZED LAYOUTS IN GUNTUR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2024, 3:28 PM IST
Guntur Municipal Commission Action Illegal Layouts : గుంటూరు నగరంలో పుట్టగొడుగుల్లా వెలసిన అనధికార లే అవుట్లపై నగరపాలక సంస్థ ఉక్కుపాదం మోపుతోంది. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఆఫీస్ రోడ్డు, సీతయ్యడొంక రోడ్డులోని లేఅవుట్లలో హద్దు రాళ్లు, బోర్డులు తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు 40 అక్రమ లేఅవుట్లు గుర్తించామని అనుమతిలేని ప్లాట్లు, ఇళ్లను ఎవరూ కొనుగోలు చేయొద్దని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. వైఎస్సార్సీపీ నేత అంబటి మురళి అనుమతి లేకుండా 14 అంతస్తుల భవనం కట్టారని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అనధికార లే అవుట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారం రోజుల పాటు డ్రైవ్ చేపట్టారని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తెలియజేశారు. ఇప్పటికే అనధికార లే అవుట్ల యజమానులకు నోటీసులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కొంత మంది యజమానులు నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అక్రమ లే అవుట్లుల్లో ఫ్లాట్లు, ఇళ్లు తీసుకుంటే అనేక రకాలుగా లబ్ధిదారులు నష్టపోతారని వివరించారు. టైటిల్ వివాదాలు, కోర్టు కేసులు, మౌలిక సౌకర్యాల సమస్యలు వస్తాయని వెల్లడించారు. అనుమతి ఉన్న లేఅవుట్లలోనే ప్లాట్లు, ఇళ్లు తీసుకోవాలని సూచించారు.