మాజీ సీఎం జగన్, మాజీ సీఎస్ జవహర్ రెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదు - Gangadhar Complaint Against Jagan - GANGADHAR COMPLAINT AGAINST JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 23, 2024, 4:46 PM IST
Gangadhar Filed a Complaint Against Jagan And Former CS: వైఎస్సార్సీపీ అధినేత జగన్, మాజీ మంత్రులు, మాజీ సీఎస్ జవహర్ రెడ్డిపై మంగళగిరి రూరల్ ఠాణాలో గంగాధర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. జాతీయ పర్యావరణ సంస్థ అనుమతి లేకుండా విశాఖలోని రుషికొండపై భవనాలు నిర్మించేందుకు సుమారు రూ.421 కోట్ల రూపాయలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రిషి కొండపై ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున భవనాల నిర్మాణంతో ప్రజల డబ్బులు దుర్వినియోగం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు.
ఈ నిధుల వినియోగంలో సక్రమమైన బిల్లులు సమర్పించలేదని గంగాధర్ చెప్పారు. ఈ వ్యవహారంపై జగన్, ఆయన సహచర మాజీ మంత్రులు, అప్పటి సీఎస్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రుషికొండపై పర్యాటక రిసార్టు నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. 421 కోట్లపైగా కేబీనెట్ ఆమోదించి పర్యావరణ సంస్థ అనుమతులు తీసుకొకుండా భవనాలు నిర్మించారన్నారు. జగన్ కేబీనెట్లో ఉన్న 26 మంది మంత్రులు, జవహర్ రెడ్డితో సహా అందరినీ అరెస్టు చేసి మొత్తం సొమ్మును రికవరీ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.