తెలంగాణలో ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది : తమిళిసై - former governor tamilisai - FORMER GOVERNOR TAMILISAI
Published : May 5, 2024, 5:14 PM IST
Tamilisai Election Campaign in Telangana : భారత్ శక్తివంతమైన దేశంగా నిలవాలంటే మోదీతోనే సాధ్యమని మాజీ గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్ధతుగా జియాగూడలో నిర్వహించిన గంగపుత్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని పేర్కొన్నారు. తమిళనాడులో ఎన్నికలు ముగియగానే ఇక్కడికి ప్రచారం చేయడానికి వచ్చినట్లు తెలిపారు.
ఇప్పుడు తానొక సాధారణ బీజేపీ కార్యకర్తనని తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థే లేరని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇటువంటి వాటిని ప్రజలెవరూ నమ్మవద్దని సూచించారు. మోదీ పాలనలోనే దేశం అభివృద్ది సాధ్యమని పేర్కొన్నారు. ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేసి హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.