రంగంలోకి నేవీ హెలికాప్టర్లు- వరద బాధితులకు ఆహారం, తాగునీరు - Food distribution to flood victims - FOOD DISTRIBUTION TO FLOOD VICTIMS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2024, 6:56 PM IST
Food Distribution to Flood Victims Through Helicopters : వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం జోరుగా సహాయ చర్యలు కొనసాగిస్తోంది. వరద సహాయ చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి మూడు హెలికాప్టర్ల ద్వారా బాధితులకు ఆహారం, మందుల పంపిణీ కొనసాగుతోంది. వరద బాధిత ప్రాంతాల్లో నేరుగా హెలికాప్టర్ల ద్వారా ప్యాకెట్లను జార విడుస్తున్నారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో బాధితులకు హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 3 టన్నులకుపైగా ఆహారం, నీళ్లు బాధితులకు అందజేసినట్లు అధికారులు తెలిపారు.
బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, బ్రెడ్, ఫ్రూట్ జ్యూస్ టెట్రాప్యాక్స్, ఇతర ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. మరో నాలుగు హెలికాఫ్టర్లు వరద సహాయక కార్యక్రమంలో పాల్గొననున్నట్లు అధికారులు చెబుతున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించలేని ఇరుకైన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈమేరకు డ్రోన్లతో ఆహారం తీసుకెళ్లే విధానాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు.