టోలిచౌకిలో భారీ అగ్ని ప్రమాదం - ఆయిల్ గోడౌన్లో చెలరేగిన మంటలు - Fire Accident In Tolichowki
Published : Mar 16, 2024, 10:43 AM IST
Fire Accident In Tolichowki : హైదరాబాద్ టోలీచౌకిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టోలీచౌకిలోని ఓ ఆయిల్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం కారణంగా వందల సంఖ్యలో ఉన్న ఆయిల్ డబ్బాలు పగిలిపోయి అందులోకి ఆయిల్ కాలనీ నుంచి టోలిచౌకి - మెహదీపట్నం ప్రధాన రహదారిపైకి ప్రవహించింది. ఈ మార్గం గచ్చిబౌలి నుంచి వచ్చే ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదంలో ఎలాంటి గాయాలు, ప్రాణ నష్టం జరగనప్పటికీ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో విద్యుత్ ను నిలిపివేశారు.
Huge Fire Accident in Hyderabad : రోడ్డుపైకి వచ్చి ఆయిల్ కారణంగా పలువురు వాహనదారులు అదుపుతప్పి కింద పడిపోయారు. పోలీసులు స్పందించి రోడ్డుపై పైకి వచ్చిన ఆయిల్ పై ఇసుక, మట్టి పోసి వాహనాలు కింద పడకుండా చూశారు. కొందరు ఆర్మీ అధికారులు స్వచ్ఛందంగా వచ్చి మంటలు ఆర్పడంతో సహాయం చేశారు. ఘటనా స్థలాన్ని సౌత్ వెస్ట్ డీసీపీ ఉదయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మోయినుద్దీన్ పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.