ప్రారంభించిన 12రోజుల్లోనే - నాసిన్ అకాడమీలో భారీ అగ్నిప్రమాదం - Fire accident in Sathyasai district
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 7:00 PM IST
Fire Accident at Nacin Academy of Sathyasai District : శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న నాసిన్ అకాడమీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో ఉన్న అకాడమీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. దీంతో అకాడమీలోని గ్రంథాలయ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన అంతస్తు మెుత్తం పెద్దఎత్తున మంటలు వ్యాపించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు నాసిన్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలించిన అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవలే సత్యసాయి జిల్లాలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ టాక్సిస్ నార్కోటిక్స్ (NACIN) కేంద్రాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.