రాత్రివేళల్లో పొలం పనులు- కొత్త విధానం అనుకుంటే పొరపాటే! కరెంట్ కష్టాలతో అన్నదాతలకు అగచాట్లు - పగటి పూట విద్యుత్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 11:33 AM IST
Farmers Faced Power Problems: రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు నిలిచిపోతుందో తెలియడం లేదు. రాష్ట్ర ప్రజలు అప్రకటిత విద్యుత్ కోతల సమస్యలు ఎదుర్కోంటున్నారు. ఇంకా రాష్ట్రంలోని రైతులకైతే సీతమ్మ కష్టాలే. పగటి పూట విద్యుత్ సరిగా ఉండడం లేదని, రాత్రి వేళ విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా అవుతోందని, రాష్ట్రంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమి లేక విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడే, రాత్రి సమయంలోనైనా సరే పొలం పనులను చేసుకోవడానికి వెనుకాడటం లేదు.
శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ళ మండలంలో నరసప్ప అనే రైతు అర్ధరాత్రి వేళ పొలం పనులు చేపట్టారు. ఉదయం విద్యుత్ కోతలతో విసుగు చెందిన ఆ రైతు, అర్ధరాత్రి రాగి పైరు నాటాడు. వ్యవసాయ బోరు ద్వారా నీటిని తోడి రాగి పైరు వేశాడు. జగన్ ప్రభుత్వం 9గంటల నాణ్యమైన కరెంటు ఇస్తామని గొప్పలు చెప్పి, మూడు గంటలైనా సక్రమంగా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాత్రి పూట ఇలా పనిచేసేందుకు ఎక్కువ మొత్తంలో కూలీ చెల్లించాల్సి వస్తోందని, దీని వల్ల పెట్టుబడి అధికమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.