అప్రమత్తమైన పోలీసులు - కిడ్నాప్ చేసిన వ్యాపారిని వదిలిపెట్టిన రైతులు - Farmers kidnapped cheated merchant - FARMERS KIDNAPPED CHEATED MERCHANT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 5, 2024, 12:39 PM IST
Famers Kidnapped Cheated Trader in Markapuram : మిరపకాయల డబ్బులు ఎగ్గొట్టిన వ్యాపారిని కిడ్నాప్ చేసిన బాధితులు ఎట్టకేలకు అతడ్ని విడుదల చేశారు. దీంతో కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బిరుదుల నరవకు చెందిన మిరపకాయల వ్యాపారి వెంకటరెడ్డి గొట్టిపడియ గ్రామానికి చెందిన రైతులకు రూ.1.30 కోట్లు ఎగ్గొట్టడంతో బుధవారం అపహరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్థానిక రైతులను తమదైన శైలిలో విచారణ చేయడంతో అపహరణకు పాల్పడిన వారిలో కదలిక వచ్చింది.
ఈలోగా సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు అబ్దుల్ రెహమాన్, వెంక టేశ్వరనాయక్, వెంకట సైదులు, పలువురు ఎస్సైలు స్థానిక నాయకులను సమన్వయం చేసుకుంటూ రైతులతో మాట్లాడారు. దీంతో కిడ్నాప్ చేసిన వారు అప్రమత్తమై గురువారం రాత్రి 8 గంటల సమయంలో గొట్టిపడియ గ్రామానికి శివారులోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద వ్యాపారిని విడిచి పెట్టి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. వ్యాపారి డబ్బులు ఎగ్గొట్టడంపై జిల్లాలో పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదని రైతులు పోలీసుల వద్ద వాపోయారని తెలిసింది. తమ అప్పులు ఎవరు తీరుస్తారని వారు ప్రశ్నించారు. వెంటనే నగదు అందేలా చూడాలని వారు గట్టిగా కోరినట్లు సమాచారం.