కృష్ణా నదీ జలాల వాడకంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది : జగదీశ్ రెడ్డి - కాంగ్రెస్‌పై జగదీశ్ రెడ్డి ఫైర్
Published : Feb 4, 2024, 4:15 PM IST
EX Minister Jagadeesh Reddy On Congress Govt : కృష్ణా నదీ జలాల వాడకంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు.
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ఖమ్మం జిల్లాకు తాగు నీరు అందించడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు సాగు, తాగు నీరు లేక గోస పడుతుంటే, జిల్లా నాయకులమని చెప్పుకునే వాళ్లకు వినిపించడం లేదని విమర్శించారు. అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల వైఫల్యాలను అధిగమించి, ఎంపీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.