శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి - విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి - Electric Shock
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 18, 2024, 1:54 PM IST
Electric Shock in Sri Rama Procession in YSR District : వైఎస్సార్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వేంపల్లి మండలం రామిరెడ్డి పల్లెలో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు గ్రామంలో స్వామి వారి ఊరేగింపులో విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 8 మందికి గాయాలయ్యాయి. ఇనుముతో చేసిన హనుమంతుడి విగ్రహానికి పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో పుల్లయ్య గారి చంద్ర ఓబుల్ రెడ్డి మృతి చెందారు.
ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు పులివెందులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతి చెందిన చంద్ర ఓబుల్ రెడ్డిని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పండగపూట గ్రామంలో విషాదం జరగడంతో రామిరెడ్డి పల్లెలో విషాదఛాయలు నెలకొన్నాయి.