Ration Rice Smuggling in AP : ప్రభుత్వం మారినా అక్కడ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా రేషన్ మాఫియాను పట్టించుకోవడం లేదు. అధికారుల అండతో యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లపాటు రేషన్ మాఫియాను వ్యవస్థీకృతం చేసి, లక్షల టన్నుల పేదల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసిన నాయకుడికి కూటమి ప్రభుత్వంలోనూ కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు సలాం కొడుతున్నారు.
ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌ను అసభ్యంగా తూలనాడిన ఆ నేతకే జై అంటున్నారు. రైస్ మిల్లుల్లో తనిఖీలు చేసినా, అక్రమ బియ్యం రవాణాను అడ్డుకున్నా ఆయన సంగతేమోగానీ వీరు మాత్రం ఉలిక్కిపడుతున్నారు. రేషన్ మాఫియాకు ఏమాత్రం అడ్డుకట్టపడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావొస్తున్నా తనిఖీలకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా పోలీసు, రెవెన్యూ, రాష్ట్ర పన్నులు, రవాణా తదితర శాఖల నుంచి సహకారమనేది లేనే లేదు.
ద్వారంపూడి కుటుంబీకుల సామ్రాజ్యమే : పోర్టు, సమీపంలోని మిల్లులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలాది టన్నుల రేషన్ బియ్యం నిల్వలు పట్టుబడినా అక్రమార్కుల్లో బెదురన్నది కనిపించడం లేదు. కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం దందా మూడు పువ్వులు, ఆరు కాయల చందంగా సాగిపోతోంది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సామ్రాజ్యానికి ఎదురే లేదనేలా పరిస్థితి ఉంది. పట్టుబడిన నిల్వలకు బ్యాంకు గ్యారంటీలు చూపిస్తున్నారు. బియ్యాన్ని బయటకు తీసుకొచ్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 6ఏ కేసులకు మించి మమ్మల్నేం చేయగలరు? అంటూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. వైఎస్సార్సీపీ నేతతో అప్పట్లో అంటకాగిన అధికారులే నేటికీ కీలక శాఖల్లో ఉంటూ సహకరిస్తుండటమూ బియ్యం అక్రమ రవాణాకు ఊతమిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 25.59 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. దీనికి సుమారు రూ.11,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కిలో బియ్యానికి రూ.43 చొప్పున ఖర్చవుతున్నాయి. వీటిని రేషన్ మాఫియా కిలో రూ.11 చొప్పున కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తోంది. అక్కడి నుంచి మిల్లులకు ఆ తర్వాత విదేశాలకు తరలిస్తోంది. మొత్తం పంపిణీ చేసే రేషన్ బియ్యంలో 80 శాతం నల్లబజారుకు తరలిస్తున్నట్లు అంచనా. ఇందులో 60 శాతానికి పైగా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలకు అక్రమ రవాణా అవుతోంది. వాటిని పాలిష్ చేసి, నూకలుగా మార్చి కాకినాడ, కృష్ణపట్నం ఇతర పోర్టుల ద్వారా గత సర్కార్ హయాంలో విదేశాలకు పెద్దఎత్తున తరలించారు. ఈ విధంగా కోట్ల రూపాయలు పోగేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రేషన్, మిల్లర్ల వ్యవస్థలను అప్పటి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబం గుప్పిట పట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్, రాష్ట్ర మిల్లర్ల సంఘం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిల్లర్ల సంఘం, షిప్పింగ్ సంస్థల సంఘం అధ్యక్ష పదవుల్లో వారే ఉండేవారు. వైఎస్సార్సీపీ అండదండలతో ఒక సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకున్నారు. పోర్టులపై పర్యవేక్షణ, గోదాముల్లో సోదాలు లేకపోవడంతో అక్రమ ఎగుమతులు ఇష్టారీతిన నడుస్తున్నాయి.
PDS Rice Smuggling in Kakinada Port : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం జూన్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు రోజులపాటు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. కాకినాడ యాంకరేజి పోర్టు, ఇతర ప్రాంగణాల్లోని 13 గోదాముల్లో తనిఖీలు నిర్వహించి 49,546 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 25,386 టన్నులు రేషన్ బియ్యంగా గుర్తించారు. ఈ నిల్వల విడుదలలోనూ కొందరు రాజకీయ నాయకులు చక్రం తిప్పారు. ఈ క్రమంలో 100 శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే పట్టుబడిన వాటిని వెనక్కి ఇస్తామని ప్రకటించారు. కానీ అందులో 15, 25, 75 శాతం చొప్పున బ్యాంక్, క్యాష్ గ్యారంటీలు ఇచ్చినవారికీ వెసులుబాటు కల్పించారు. తాజాగా సీజ్ చేసిన గోదాములకు సైతం వెసులుబాటు కల్పించారు.
రేషన్ మాఫియా నాయకులకు దిల్లీలో ఉన్న పలుకుబడి ముందు బియ్యం అక్రమ రవాణా కట్టడికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు తేలిపోయాయి. కాకినాడలోని నాయకుడి దన్నుతో ఎగుమతిదారుడొకరు దిల్లీలో చక్రం తిప్పారు. బియ్యం అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడానికి ఇదీ ఒక కారణంగా చెప్పొచ్చు. సీజ్ చేసిన బియ్యం విడిపించుకొని తరలించే ముసుగులో టన్నుల కొద్దీ పేదల బియ్యం నిల్వలను హద్దులు దాటించారు. దీనికి జిల్లా యంత్రాంగమూ సహకరించింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఆగస్టులో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. వాటి వద్ద పౌరసరఫరాల సంస్థ, పోలీసు, పన్నుల శాఖ, రెవెన్యూ, రవాణా, కస్టమ్స్, పోర్టు అధికారులు ఉండాల్సిందేనని మంత్రి చెప్పినా లెక్క చేయలేదు. ఇప్పటివరకు 4450 వాహనాలను తనిఖీ చేస్తే నమోదైన కేసు ఒక్కటే. జిల్లా కలెక్టర్ పోర్టులోకి వెళ్లి సోదాలు చేస్తే మాత్రం ఏకంగా 640 టన్నుల రేషన్ బియ్యం నిల్వలు పట్టుబడ్డాయి. మరో 1064 టన్నులు పోర్టులోకి చేరాయి. అంటే చెక్‌పోస్టు వ్యవస్థ ఎంత బలహీనమో అర్థమవుతోంది.
చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా - ముందే సమాచారం : మరోవైపు చెక్‌పోస్టుల్లో ఏ షిఫ్టులో ఎవరు ఉంటున్నారన్న సమాచారం ముందుగానే మిల్లర్లకు, ఎగుమతిదారులకు చేరుతోంది. దీంతో వ్యవహారాన్ని చక్కదిద్దేస్తున్నారు. వాటిని ఎత్తేయమంటూ ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు ఉండనే ఉంటున్నాయి. ఇలాంటి ప్రతికూలతల మధ్య కూటమి ప్రభుత్వం గత ఐదేళ్ల అక్రమ ఎగుమతులను వెలికితీసి యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తేనే రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు కొంతైనా తగ్గుతాయన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.
పీడీఎఫ్ రైస్ అక్రమంగా ఎగుమతి - సముద్రంలోకి వెళ్లి తనిఖీలు చేసిన కలెక్టర్
కాకినాడ కేంద్రంగా విదేశాలకు రేషన్ బియ్యం- 51,427 మెట్రిక్ టన్నులు సీజ్ - ration rice exported