అనంతలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు - రాకపోకలకు ఇబ్బందులు - Heavy Rains Streams Overflowing - HEAVY RAINS STREAMS OVERFLOWING
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 17, 2024, 11:56 AM IST
Due to Heavy Rains Streams Overflowing in Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బూదగవి, నింబగల్లు, పెంచులపాడు, ఆర్ కొటాల గ్రామాల వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఉరవకొండ – నింబగల్లు, పెంచులపాడు - పొలికి, విడపనకల్లు - గడేకల్లు గ్రామాల మధ్య ఉన్న వంకలు వర్షపునీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికి అక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
కళ్యాణదుర్గంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము రెండు గంటల వరకు వర్షం కురవడంతో పట్టణంలోని మురుగు కాలువల్లో వర్షం నీరు పొంగిపొర్లాయి. సాయిబాబా ఆలయం వద్ద ఉన్న ప్రధాన మురుగు కాలువ నుంచి వర్షం నీళ్లు అనంతపురం ప్రధాన రహదారిపై ప్రవహించాయి. ఇళ్లల్లోకి నీళ్లు చేరుతాయని కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ ఇంటి గడప వద్ద కూర్చున్నారు. ప్రధాన మురుగు కాలువ వెంట అక్రమ నిర్మాణాలు నిర్మించడం, కాలువలో పూడిక పేరుకుపోవడంతో వర్షం నీళ్లు సమీప కాలనీలోకి చేరుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.