వారానికి ఒకసారే నీళ్లు- తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న ప్రజలు - Drinking Water Problems - DRINKING WATER PROBLEMS
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 7:25 PM IST
Drinking Water Problems in Prakasam District: ప్రకాశం జిల్లాలో తాగునీటి ఎద్దడితో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వారానికి ఒకసారి మాత్రమే వాటర్ ట్యాంకర్లు రావడంతో పీర్ల మాన్యంలో ఉన్న సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే తాగునీరు కనీసం మూడు రోజులు కూడా రావడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ట్యాంకర్ అయిదు లేదా ఆరు కుటుంబాలకు ఇవ్వడంతో అందరికీ సక్రమంగా నీరు అందడం లేదని స్థానికులు వాపోయారు.
మంచినీళ్లు ఇవ్వకుండా ప్రజలను నగరపాలక సంస్థ ఇబ్బందులకు గురి చేస్తుందని స్థానికులు మండిపడ్డారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వారు వాపోయారు. ఎంతోకాలం నుంచి ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే కొద్దిపాటి నీళ్లు కూడా ఇంట్లో అందరికీ సరిపోవటం లేదని తెలిపారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.