రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలి: దేవినేని ఉమ - టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 7:15 PM IST
Devineni Umamaheswara Rao: మైలవరం నియోజకవర్గం అన్నేరావుపేటలో ఫిబ్రవరి రెండో వారంలో తాను ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు వెల్లడించారు. వంద కోట్లు ఇస్తామంటూ వస్తున్న రాజకీయ వ్యభిచారులను తరిమికొట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత 25 ఏళ్లుగా పార్టీ నిర్ణయాలను శిరసావహించి ముందుకు నడిచానని ఉమా తెలిపారు. మైలవరంలో దోచిన డబ్బులు పెట్టి గెలుస్తామంటే ప్రజలు ఒప్పుకోరన్నారు.
తనపై దాడులు చేసి చంపాలని చూశారని, ఈ రోజు తాను బ్రతికి ఉన్నానంటే తమ నాయకుడి అండ కార్యకర్తల బలమే కారణమని చెప్పారు. ఎన్నికల తర్వాత జైలుకైనా వెళ్తా, లేదా చింతలపూడి కాలువల మీదైనా పడుకుంటానని వ్యాఖ్యానించారు. జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తేల్చిచెప్పారు. ఈ సారి జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ గద్దే దించడమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఉమామహేశ్వర రావు పిలుపునిచ్చారు.