పెద్ద ఎత్తున వచ్చిన అర్జీలను పరిశీలించిన డిప్యూటీ సీఎం - తక్షణమే పరిష్కరించాలని ఆదేశం - Deputy CM received applications
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 27, 2024, 9:12 PM IST
Deputy CM Pawan kalyan Received Applications From People : రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి సహా అటవీ, పర్యావరణ అంశాలతో పాటు ఇతర అంశాలపైనా వచ్చిన ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి ఒక్కోక్కటిగా పరిశీలించి పరిష్కారాలపై దృష్టి పెట్టారు. వెంకటగిరిలో బైక్ లపై మహిళలను, వృద్ధులను భయబ్రాంతులు చేస్తూ వేధిస్తున్న ముఠాలపై వచ్చిన ఫిర్యాదుపై స్పందించి తిరుపతి ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు గంటల వ్యవధిలోనే పోలీసు యంత్రాంగం స్పందించి ఆ ముఠాపై కేసులు నమోదు చేశారు. ఆయనకు కేటాయించిన శాఖల పరిధిలోని అర్జీలను సంబంధింత అధికారులకు పంపిన డిప్యూటీ సీఎం తక్షణమే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.
అలాగే అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మడ అడవుల పరిరక్షణ కోసం వెంటనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసక్తి, అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి ప్రత్యేకాధికారులుగా నియమించాలని సూచించారు. మడ అడవుల విస్తీర్ణం పెంచే ప్రక్రియలో అవసరమైతే కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని, వారి నుంచి సీఎస్‌ఆర్ నిధులు సేకరించాలని పేర్కొన్నారు.