బిల్లు వచ్చినవారు ఆ వివరాలతో మళ్లీ దరఖాస్తు చేయాలి - గృహజ్యోతిపై భట్టి క్లారిటీ
Published : Mar 10, 2024, 9:58 AM IST
Deputy CM Bhatti Clarity on Electricity Bill : తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారు, 200 యూనిట్లులోపు కరెంట్ వాడితే బిల్లు కట్టనక్కరలేదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. 200 యూనిట్లలోపు కరెంట్ వాడుకున్నట్లు ఈ నెలలో బిల్లు జారీ అయితే, అది చెల్లించకుండా వెంటనే జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని భట్టి సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 40 లక్షల 33 వేల 702 ఇళ్లకు జీరో బిల్లులు జారీ చేశామన్నారు.
సచివాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో రేషన్, ఆధార్, కరెంటు కనెక్షన్ సంఖ్య వివరాలు సక్రమంగా ఇచ్చిన వారికి జీరో బిల్లులు జారీ అవుతున్నాయని చెప్పారు. వివరాలు సరిగ్గా ఇవ్వకుంటే, 200ల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించినందుకు బిల్లులు వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వారు బిల్లు కట్టకుండా, మండల పరిషత్ లేదా మున్సిపల్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి రేషన్, ఆధార్‌కార్డు, కరెంటు కనెక్షన్ వివరాలతో దరఖాస్తు చేస్తే వారికి మళ్లీ జీరో బిల్లు జారీ అవుతుందని భట్టి వివరించారు. ఇప్పటికే ఇలా 45 వేల మందికి రివైజ్డ్ జీరో బిల్లులిచ్చినట్టు చెప్పారు.