రాష్ట్రంలో ఎవరికీ వాక్ స్వాతంత్య్రం లేదు : దగ్గుబాటి పురందేశ్వరి - Daggubati Purandeshwari News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 2:02 PM IST
Daggubati Purandeswari Criticized the YCP Government : విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో రాజ్యాంగ స్ఫూర్తి లేదని ఆరోపించారు. సమసమాజ స్థాపన అనే భావన ఎక్కడా కనిపించడంలేదన్నారు. ప్రజల హక్కుల ఉల్లంఘనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎవరికీ వాక్ స్వాతంత్యం లేదని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గళం విప్పినా వారిని జైలుకు పంపుతున్నారని విమర్శించారు. వారు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే భయపెట్టి నిర్బంధాలు, వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు.
ప్రజా సేవ భావన అనేది వైఎస్సార్సీపీ పాలనలో కనిపించడంలేదని దుయ్యాబట్టారు. రాజ్యాంగంలోని సమన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం రాష్ట్రంలో కొరవడ్డాయని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ అన్నారు. అలాగే సమాఖ్య వ్యవస్థలో కొన్ని రాష్ట్రాల వ్యవహారాలు దేశాభివృద్ధికి విఘాతంగా మారుతున్నాయని తెలిపారు. మన రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా ఉచితంగా జెండాలను అందిస్తున్న ఏలూరుకు చెందిన జెండా సుభాన్ని సత్కరించారు.