చీకట్లో ప్రభుత్వ ఆసుపత్రి - సెల్ ఫోన్ వెలుతురులోనే వైద్య సేవలు - peoples issues in govt hospital
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 10:01 PM IST
Current Problems at Government Hospital in Prakasam District : ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. జిల్లాలోని మార్కాపురం సర్వజన ఆసుపత్రిలో రోగులు చీకట్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో తరచూ విద్యుత్ పోతుండటంతో రోగులు చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కరెంట్ పోయిన సమయంలో ఆసుపత్రిలో దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు సైతం చీకట్లో అవస్థలు పడుతున్నారు. ఇక చిన్నపిల్లలైతే ఊపిరాడక సతమతమవుతున్నారు. కరెంటు పోయి గంటలు దాటుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆసుపత్రిలో జనరేటర్ ఉన్న దాన్ని వేసేందకు కూడా సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని రోగులు మండిపడ్డారు.
ఆసుపత్రిలో విద్యుత్ సమస్యలు పరిపాటిగా మారిపోయాయని సిబ్బంది సైతం చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో సెల్ ఫోన్ వెలుతురులోనే వైద్య సేవలు అందించాల్సిన దుస్థితి వస్తోందని తెలిపారు. విద్యుత్ సమస్యపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఎంతో మంది పేదలు వచ్చే ఆసుపత్రిపై ప్రభుత్వం ఇప్పటికైన దృష్టి పెట్టాలని రోగులు కోరుతున్నారు.