పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: వామపక్ష నేతలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 1:49 PM IST
CPI Protest Against YSRCP Govt on Railway Lands : గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రైల్వే స్థలాలలో నివాసం ఉన్నవారిని బలవంతంగా ఖాళీ చేయిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వామపక్ష నాయకులు హెచ్చరించారు. ఈనెల రెండులోపు స్థలాలను ఖాళీ చేయాలని అధికారులు బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ వామపక్ష రాష్ట్ర నాయకులు బాధితులతో మాట్లాడారు. రైల్వే స్థలాలలో నివాసం ఉంటున్న వారికి పట్టాలిస్తామని జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
బాధితులను వామపక్ష రాష్ట్ర నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, వివి శ్రీనివాసరావు పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రతాపాన్నంతా పేదల పైన చూపిస్తున్నాయని దీనిని ఎలాగైనా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి సీఎం జగన్ హామీ ఇచ్చారని దానిని వెంటనే నెరవేర్చాలని నాయకులు, బాధితులు డిమాండ్ చేశారు. ఎవరైతే మీకు ఓటేసి గద్దెనెక్కించారో వారి కంచాల్లో ఇసుక పోస్తానంటే ఈరుకునేది లేదని సీపీఐ నేత నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.