విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకునేలా ఒత్తిడి తేవాలి: సీపీఐ రామకృష్ణ - Ramakrishna On Visakha Steel Plant - RAMAKRISHNA ON VISAKHA STEEL PLANT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 4:53 PM IST
CPI Leader Ramakrishna On Privatization of Visakha Steel Plant : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విరమించుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. అన్ని పార్టీల సహకారంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నామని రామకృష్ణ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి ప్రధాని మోదీని కలిసి ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరాలన్నారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతిపై ఏ విధమైన సెంటిమెంట్ ప్రజలకు ఉందో, విశాఖ ఉక్కు కర్మాగారంపై కూడా అంతే సెంటిమెంట్ ఉందని సీపీఐ నేత పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖలో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని తీసేసి అక్కడ రాజధాని నిర్మాణం చేపట్టాలన్న ఆలోచన చేసినట్లు ఆరోపణలు వచ్చాయని ఆయన అన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మనోభావాలు, కార్మిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిలిపివేసేలా కేంద్రంతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు.