YSRCP ZPTC Member Son Attack On Common Man in Anantapur : అధికారం పోయినా వైఎస్సార్సీపీ నాయకుల వ్యవహార శైలిలో మార్పు రాలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినా వారి దౌర్జన్యాలు ఆగడం లేదు. అనంతపురంలో అన్నదమ్ముల వివాదంలో ఓ వైఎస్సార్సీపీ జడ్పీటీసీ సభ్యురాలు రెడ్డెమ్మగారి రమాదేవి కుమారుడు రవిప్రసాద్‌రెడ్డి జోక్యం చేసుకొని హల్‌చల్ చేశాడు.
నాలుగో పట్టణ సీఐ సాయినాథ్ తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం నగరానికి చెందిన సోదరులు హేమరామ్, మంగిలాల్ మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి. గురువారం హేమరామ్ కుమారుడు ప్రవీణ్‌కుమార్ శ్రీకంఠం సర్కిల్‌లో ఉన్న తన బాబాయి మంగిలాల్ దుకాణానికి తాళం వేశాడు. ఈ క్రమంలో అతనికి తన మిత్రులైన జయప్రకాశ్‌నారాయణ, సాయికుమార్, బోయ రాము సహకరించారు. మంగిలాల్ తనకు పరిచయం ఉన్న విగ్నేశ్వర్‌రెడ్డికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న విగ్నేశ్వర్రెడ్డిపై హేమరామ్ వర్గం దాడి చేసింది. పోలీసులు రావడంతో ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే తనపై జరిగిన దాడిని విగ్నేశ్వర్‌రెడ్డి అవమానంగా భావించాడు. ఈ విషయం తన మిత్రుడైన పెద్దపప్పూరు మండలం జడ్పీటీసీ సభ్యురాలు రెడ్డెమ్మగారి రమాదేవి కుమారుడు రవిప్రసాద్‌రెడ్డికి తెలిపాడు. దాడి చేసిన వారిపై కక్ష తీర్చుకోవాలనుకున్నారు.
రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ శ్రేణులు - టీడీపీ నేతపై గొడ్డళ్లతో దాడి - murder attempt on tdp leader
శుక్రవారం రాత్రి విగ్నేశ్వర్‌రెడ్డి, మంగిలాల్, అశోక్, రవిప్రసాద్‌రెడ్డి అతని అనుచరులు గంగారాజేశ్ తదితరులతో కలిసి ఆజాద్‌నగర్‌లో ఉన్న జయప్రకాశ్‌నారాయణ కార్యాలయం వద్దకు మూడు కార్లలో వెళ్లారు. అక్కడే ఉన్న జయప్రకాశ్, సాయికుమార్, బోయ రాములపై దాడికి దిగారు. అందరూ చూస్తుండగానే వారిని అసభ్యంగా తిడుతూ కాళ్లతో తంతు, చొక్కా విప్పించి పరిగెత్తిస్తూ విచక్షణా రహితంగా కొట్టారు.
ఆ తరువాత ముగ్గుర్నీ కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. స్థానికులు డయల్ 100 నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ముగ్గురిని వారు హెచ్చెల్సీ కాలనీ వద్ద వదిలేసి వెళ్లారు. నాలుగో పట్టణ పోలీసులు బాధితులను కాపాడి స్టేషనుకు తరలించారు. బాధితుడు జయప్రకాశ్ నారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామన్నారు.