VHP Haindava Sankharavam: ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ధార్మిక స్వాతంత్య్ర పోరాటానికి హైందవ శంఖారావం పూరించబోతున్నట్లు విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో భారీ బహిరంగ సభ ఆదివారం నిర్వహించనున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరువలో 30 ఎకరాల్లో ఈ సభ, పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. బస్సులు, రైళ్లల్లో భారీగా ప్రజలు తరలి వస్తున్నారు.
హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ఈ సభలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి శంఖారావాన్ని పూరించి సభలకు అంకురార్పణ చేస్తున్నారు. 5వ తేదీ మధ్యాహ్నం ఈ సభ ప్రారంభమై సాయంత్రం వరకు జరగనుంది. హిందూ ఆలయాలు ప్రభుత్వాల చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ఆరోపించారు. భక్తులే స్వయం ప్రతిపత్తితో నిర్వహించాలనే డిమాండ్‌తో ఈ హైందవ శంఖారావ సభలు జరగనున్నాయి.
గన్నవరం విమానాశ్రయానికి చేరువగా 30 ఎకరాల విస్తీర్ణంలో ఈనెల ఐదో తేదీ మధ్యాహ‌్నం పన్నెండు గంటల నుంచి హైందవ శంఖారావం పేరిట బారీ బహిరంగసభ జరుగుతుందని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులు, రైళ్లు, సొంత వాహనాలపై లక్షల మంది హిందువులను ఈ సభలో పాల్గొనేలా జనసమీకరణ చేస్తున్నామని చెప్పారు. హిందు దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి రక్షణ, సమాజ సంరక్షణ కోసం ఈ శంఖారావం పూరిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వాల ద్వారా హిందూ దేవాలయాల నిర్వహణ చేయడం అనేది రాజ్యాంగంలోని 12, 25, 26 ఆర్టికల్స్ ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే కాకుండా హిందూ విశ్వాసాలపై తీవ్రమైన దాడి అవుతుందని అన్నారు. ఆలయాల నిర్వహణ, ఆస్తుల విషయాల్లో ప్రభుత్వాలు దూరంగా ఉండాలని న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు సెక్యులర్ ముసుగులో హిందూ సంప్రదాయాలను నాశనం చేయాలనే సంకల్పంతో ఆలయాలను తమ గుప్పెట్లో పెట్టుకుని దేవాలయ వ్యవస్థకు నష్టం కలిగించాయని ఆరోపించారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న ఆలయాల కోసం: ఆలయాలను స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్టసవరణ చేయాలని విశ్వహిందూ పరిషత్తు జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న ఆలయాల కోసం ఈ పోరాటం చేస్తున్నామని, గతంలో విశ్వహిందూ పరిషత్తు ఎన్నో పోరాటాలు చేసినా ఈ శంఖారావం వాటికి భిన్నం అని తెలిపారు. శంఖారావం కార్యక్రమానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని, అన్ని రాజకీయ పక్షాలకు ఆహ్వానం పలికామన్నారు.
3 వేల మందితో బందోబస్తు: ఈనెల ఐదో తేదీన గన్నవరం వైపు వచ్చే వారు ట్రాఫిక్ ఆంక్షలను గుర్తించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు కోరారు. భారీగా జనం వస్తారనే అంచనాతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు వేల మందిని బందోబస్తుకు వినియోగిస్తున్నారు. 500 సీసీ కెమెరాల నిఘాతోపాటు గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు ఉన్నప్పటికీ పరిమిత ఎత్తులో డ్రోన్ల ద్వారా కూడా నిఘాకు ఒక్క రోజే అనుమతి తీసుకున్నట్లు ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు.
హిందూ ధార్మిక సంస్థల ఉద్యమం - జనవరి 5న 'హైందవ ధర్మ శంఖారావం'