Cheetah Wandering Around Nandyal District:నంద్యాల జిల్లాలో చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జిల్లాలో వెలుగు చూస్తున్న ఘటనలతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల క్రితం నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది సమీపంలో చిరుత సంచారంతో స్థానికులు గజగజా వణికిపోయారు. ఆ ఘటన మరచిపోకుండానే తాజాగా శ్రీశైలంలోని పాతాళగంగ సమీపంలో నేరుగా ఓ ఇంట్లోకి చిరుత చొరబడడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది.
ఇంట్లోకి చొరబడిన చిరుత : శ్రీశైలంలోని పాతాళగంగ ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఆ ప్రాంతంలోని ఒక ఇంటి వద్ద రాత్రి వేళ చిరుత పులి సంచరించడం సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఇళ్ల వద్ద చిరుతపులి సంచరించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చుట్టూ ఉన్న పరిసరాలు అటవీ, నది తీర ప్రాంతం కావడంతో పాతాళగంగ ప్రాంతంలో తరచూ చిరుత పులులు సంచరిస్తుంటాయి.
గతంలో సైతం : ప్రముఖ శైవ క్షేత్రం నంద్యాల జిల్లా మహానంది సమీపాన చిరుత పులి సంచారం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. మహానంది నుంచి గాజులపల్లెకు వెళ్ళే రహదారిలో సరిగ్గా నెలరోజుల క్రితం పార్వతీపురం వద్ద చిరుత ఆలయానికి వెళ్లే భక్తులకు కనపడింది. వారు వెంటనే తమ వద్ద ఉన్న చరవాణిలో చిరుత కదలికలను రికార్డు చేశారు. మూడు నెలల క్రితం మహానంది వాసులను, భక్తులను కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుతే మరలా తారసపడంతో ప్రజలు ఆందోళన చెందారు.
నెల్లూరు జిల్లా పెనుశిల అభయారణ్యంలో పెద్దపులి, చిరుతల సంచారం - forest department officer interview