LIVE : జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్రెడ్డి ప్రెస్ మీట్
Published : Dec 1, 2024, 4:17 PM IST
|Updated : Dec 1, 2024, 4:45 PM IST
CM Revanth Press Meet at Jubilee Hills Residence : కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది కావడంతో, తాము చేసిన ప్రగతిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశంలో వివరిస్తున్నారు. అలానే శనివారం మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన రైతుపండుగలో లక్షలాది మంది రైతులు పాల్గొన్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మిగతా 9 ఏళ్లు కూడా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తామనే నమ్మకం కలిగిందని అన్నారు. అదేవిధంగా కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా దక్కించుకోవడానికి ట్రైబ్యునల్ ఎదుట సమర్థ వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులకు స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, నదీజలాల అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో సాగునీటి పరిస్థితి, అంతర్ రాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉండగా, ఏపీలో కేవలం 30 శాతం ఉందన్నారు. ఆ ప్రకారం 1005 టీఎంసీల కృష్ణా జలాల్లో 70 శాతం నీటివాటా తెలంగాణకు దక్కేలా.. వాదనలు వినిపించాలని సూచించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారు.
Last Updated : Dec 1, 2024, 4:45 PM IST