రాష్ట్ర అవతరణ వేడుకల్లో డప్పు వాయించిన సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Played Drum at Tank Bund
Published : Jun 2, 2024, 8:15 PM IST
CM Revanth Played Drum at Tank bund : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై ‘పదేళ్ల పండుగ’ పేరుతో నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ముందుగా ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఆయనతో కలిసి సీఎం సహా రాష్ట్ర మంత్రులు, సీఎస్ శాంతి కుమారి తదితరులు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు, తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 కళలను ప్రదర్శించారు. ఈ క్రమంలోనే డప్పు కళాకారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం డప్పు కొట్టి, వారిలో ఉత్సాహం నింపారు. మరోవైపు ఐదు వేల మంది ట్రైనీ పోలీసులతో ఫ్లాగ్ వాక్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలిరావడంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. దీంతో అటు వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు.