మూసీ విజన్ 2050 - సహకారం అందిస్తామన్న లండన్ టీమ్
Published : Jan 20, 2024, 12:00 AM IST
CM Revanth Reddy and Team Landon Tour : మూసీపునరుద్ధరణ, సుందరీకరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం లండన్‌లోని థేమ్స్ నదిపై అధ్యయనం చేసింది. లండన్‌పోర్ట్, థేమ్స్ నిర్వహణ అధికారులు, నిపుణులతో రేవంత్‌రెడ్డి చర్చించారు. మూసీ పరీవాహక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం తెలిపారు. థేమ్స్ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజినీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు రేవంత్‌రెడ్డికి వివరించారు. హైదరాబాద్‌లో మూసీ హుస్సేన్‌సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాధాన్యత, ప్రస్తుత పరిస్థితులపై థేమ్స్ నిపుణులకు సీఎం తెలిపారు. మూసీకి పునర్వైభవం వస్తే నది, చెరువులతో భాగ్యనగరం శక్తిమంతమవుతుందని వివరించారు.
మూసీ విజన్ 2050కి స్పందించిన పోర్ట్ ఆఫ్ లండన్ బృందం పూర్తి సహకారమందిస్తామని తెలిపింది. భవిష్యత్‌లో మరిన్ని చర్చలు, భాగస్వామ్యానికి సిద్ధమని పేర్కొంది. మూసీ అభివృద్ధితో హైదరాబాద్ ప్రజలకు భవిష్యత్తులో పలు ప్రయోజనాలుంటాయని పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు తెలిపారు. సుమారు 1000 అడుగులకుపైగా ఎత్తు ఉన్న 72 అంతస్తుల లండన్ షార్ట్‌పై నుంచి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. లండన్ నగరం, థేమ్స్ నది పరీవాహకంలో అభివృద్ధిని వారు పరిశీలించారు.