4 ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ సందర్శనకు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రజాప్రతిధులు
Published : Feb 13, 2024, 12:50 PM IST
CM Revanth Reddy And Ministers Medigadda Tour : సీఎం రేవంత్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయల్దేరి వెళ్లారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి నేరుగా 4 ప్రత్యేక బస్సుల్లో పయనమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకోనున్నారు. సీఎం, మంత్రులు ఒక బస్సులో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర బస్సుల్లో వెళ్తున్నారు. మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్, బీజేపీ దూరంగా ఉన్నాయి. ఎంఐఎం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు పర్యటనకు వెళ్లారు.
CM Revanth Reddy And Ministers to Visit Medigadda : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద అధికార యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. డీఐజీ, నలుగురు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్సైలు, సుమారు 800 మంది పోలీసు బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను సీఎం బృందం పరిశీలించే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అక్కడ నదీ గర్భం నుంచి నీరు పైకి వస్తుండటంతో మోటార్లతో ఎత్తిపోశారు. బ్యారేజీ ప్రాంతంలో వ్యూ పాయింట్ వద్ద సుమారు 3 వేల మంది కూర్చోవడానికి వీలుగా సభా స్థలిని ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని ఇక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు సీఎం వివరించనున్నారు.