వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు విడుదల - బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్ - Release of YSR Rythu Bharosa funds
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 4:51 PM IST
CM Jagan Released YSR Rythu Bharosa - PM Kisan Funds: వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. మూడో విడతగా ఒక్కొ రైతుకు రూ. 2 వేల చొప్పున నిధులను విడుదల చేశారు. 53.58 లక్షల మంది రైతన్నలకు 1,078.36 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. వీటితో పాటు 2021-22 రబీ, 2022 ఖరీఫ్‌లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ నిధులను సీఎం విడుదల చేశారు. 10 లక్షల 78 వేల 615 మంది రైతన్నలకు 215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము చెల్లించారు. వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం ద్వారా ఏటా 13 వేల 500 రూపాయల చొప్పున ప్రతి రైతుకి ఇచ్చినట్లు సీఎం తెలిపారు.
ఐదేళ్లలో రైతులకు 34 వేల 288 కోట్లు రైతులకు అందించినట్లు సీఎం వివరించారు. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రుణాలను రైతులకు చెల్లిస్తూ వస్తున్నామన్న సీఎం ఇప్పటి వరకు 84.67 లక్షల రైతులకు 2051 కోట్లను ఇచ్చినట్లు తెలిపారు. ఈ క్రాప్ ద్వారా పూర్తిగా పంటల బీమాను అమలు చేసి రైతులకు సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. వచ్చే నెల 6న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మొత్తం విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు.