బాపట్ల జిల్లాలో దారుణం - యువతి హత్యాచార ఘటనపై సీఎం సీరియస్ - Woman raped in Bapatla district - WOMAN RAPED IN BAPATLA DISTRICT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 5:22 PM IST
|Updated : Jun 26, 2024, 8:19 PM IST
Woman raped and Murdered In Bapatla District : బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామును బహిర్భూమికి వెళ్లిన ఓ యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాచారం చేశారు. తన కుమార్తె ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డ తండ్రి వెతుక్కుంటూ వెళ్లగా రైల్వే ట్రాక్ పక్కల ఉన్న ముళ్ల చెట్లలో ఆ మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జిందాల్ పరిశీలించారు. నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని, త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.
సీఎం ఆగ్రహం..
మహిళపై జరిగిన హత్యాచారం ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని సూచించారు. ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలన్నారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి, కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా జాప్యం జరగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హోంమంత్రి అనిత హత్య జరిగిన ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు.