తెలంగాణలో అందరం కలిసి ముందుకెళ్తే అభివృద్ధి జరుగుతుంది : బండి సంజయ్ - Union Minister Bandi Sanjay on TG Development - UNION MINISTER BANDI SANJAY ON TG DEVELOPMENT
Published : Jun 10, 2024, 12:39 PM IST
Union Minister Bandi Sanjay on TG Development : రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సహా అన్ని పార్టీల నేతలు అదే ఒరవడి కొనసాగించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అందరూ కలిసి ముందుకెళ్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందని బండి సంజయ్ వెల్లడించారు. ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలు, కార్యకర్తల రుణం తీర్చుకుంటానని వివరించారు. ఫోర్ట్ ఫోలియో వచ్చిన తర్వాత అందుకు తగిన విధంగా న్యాయం చేస్తానని తెలిపారు. కేంద్రంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. రాజకీయాలన్ని పక్కనబెట్టి అందరం కలిసిమెలిసి ఉండేలా ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. అలా కాకుండా ఉండాలంటే అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.