తప్పతాగి యువకుడి డ్రైవింగ్ - జూబ్లీహిల్స్‌లో కారు బోల్తా - Car Accident At Jubilee Hills - CAR ACCIDENT AT JUBILEE HILLS
Published : Jul 31, 2024, 10:11 AM IST
Car Accident At Jubilee Hills : హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో బీటెక్ విద్యార్థి సాకేత్ రెడ్డి తన మిత్రుడితో కలిసి కారు డ్రైవింగ్ చేసి ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కృష్ణానగర్ వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి చేరుకుని అక్కడున్న టెలిఫోన్ స్తంభాన్ని ఢీ కొని బోల్తా పడింది. ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న సాకేత్ రెడ్డితో పాటు అతని మిత్రుడికి గాయాలయ్యాయి. వారిని స్ధానికులు బయటకు తీశారు.
అనంతరం పోలీసులు వారికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా మద్యం మోతాదు 146 పాయింట్లు నమోదైంది. గాయపడ్డ ఇరువురిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినప్పటికీ వినకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కొందరు ఆకతాయిలు మితీమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారని స్థానికులు వాపోతున్నారు.