యాదాద్రిలో 9వ రోజు శ్రీ మహావిష్ణువు అలంకారంలో స్వామివారు - Brahmotsavams In Yadadri Temple
Published : Mar 19, 2024, 3:49 PM IST
Brahmotsavams In Yadadri Temple : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు స్వామివారు శ్రీమహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనసేవపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. విష్ణుమూర్తి అలంకారంలో గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో స్వామి వారు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు.
స్వామివారికి వజ్ర వైఢూర్యాలతో అలంకరించి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేదపండితులు. రాత్రి రథోత్సవం, 8.45 గంటలకు స్వామివారి దివ్య విమాన రథం ఊరేగింపు వైభవంగా జరగనుందని ఆలయ వర్గాలు తెలిపాయి. మరోవైపు రథోత్సవంలో భాగంగా స్వామివారి దివ్య విమాన రథంపై ఊరేగింపు సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తరువాత రెండోసారి రథోత్సవ తంతును స్వామివారి ఆలయ మాడవీధుల్లో నిర్వహిస్తుండటంతో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ప్రజలంతా పోలీసులకు సహకరించాలనికోరారు.