వైసీపీ ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లనే నమ్ముకుంది: పురందేశ్వరి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 2:57 PM IST
BJP State President Purandeshwari Fire on CM Jagan: ఐదేళ్లుగా దోపిడీ పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వం(YSRCP Govt) ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లనే నమ్ముకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల వేళ వైసీపీ చేసిన అక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్రం నిధులిస్తుంటే తామే అన్నీ చేస్తున్నామని వైసీపీ సర్కార్ గొప్పలు చెప్పుకుంటున్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు నిర్దేశించారు.
వచ్చే ఎన్నికల్లో బలీయశక్తిగా నిలుస్తామని పురందేశ్వరి ధీమా వ్యక్తంచేశారు. దీంతోపాటు దేశంలోని పేదలందరికి కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తోందన్నారు. ఈ పథకాన్ని మోదీ ఏనాడు రాజకీయంగా వాడుకోలేదన్న ఆమె ఉచిత బియ్యం పథాకాన్ని ప్రధాని ఐదేళ్లకు పెంచారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటింటికి బియ్యం పంపిణీ చేసే ఆటోడ్రైవర్లకు వైసీపీ సర్కారు కనీస వేతనం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు.
"దేశంలోని పేదలందరికి కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తోంది. ఉచిత బియ్యం పథకాన్ని ప్రధాని మోదీ ఐదేళ్లకు పెంచారు. ఉచిత బియ్యం పథకాన్ని మోదీ ఏనాడూ రాజకీయంగా వాడుకోలేదు. కేంద్రం నిధులిస్తుంటే తామే అన్నీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ సర్కార్ ఇంటింటికి బియ్యం పంపిణీ చేసే ఆటోడ్రైవర్లకు కనీస వేతనం ఎందుకు ఇవ్వట్లేదు? రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది బీజేపీ మాత్రమే. పంచాయతీ నిధులు, ఇసుక మాఫియా వంటి అంశాలపై భారతీయ జనతా పార్టీనే పోరాడింది. తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ దొంగఓట్లను ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. మా ఫిర్యాదు ఆధారంగానే పోలీసులపై ఈసీ చర్యలు తీసుకుంది. భవిష్యత్‌లో రాష్ట్రంలో బీజేపీ బలమైన పార్టీగా ఎదుగుతుంది" - పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు