ఉగాది వేడుకల్లో పాల్గొన్న పురందేశ్వరి- వివిధ రంగాల ప్రముఖులకు సన్మానం - Purandeswari in Ugadi Celebrations - PURANDESWARI IN UGADI CELEBRATIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 7:03 PM IST
BJP Leader Purandeswari Participate in Ugadi Celebrations: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి పురందేశ్వరి రాజమహేంద్రవరంలోని జేకే గార్డెన్స్‌లో నిర్వహించిన క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పుల్లెల సత్యనారాయణ పండితులు పంచాంగ శ్రవణం పఠించారు. అనంతరం నగరానికి చెందిన ప్రముఖులు, వివిధ రంగాల్లో ప్రసిద్ధి గాంచిన వారిని పురందేశ్వరి సన్మానించారు. ఈ ఏడాది ప్రజలకు సుఖ సంతోషాలు కలగాలని పురందేశ్వరి ఆకాంక్షించారు. క్రోధి నామ సంవత్సరంలో ప్రజలకు మంచి జరగాలని ఆమె అన్నారు. ఉగాది అంటే ఎదైనా కొత్తగా ప్రారంభించబోతున్నామని ఆమె అన్నారు. గత సంవత్సరంలో జరిగిన విఘ్నాలు అన్ని తొలగిపోయి నూతన ఏడాదిలో అన్ని శుభం జరగాలని పురందేశ్వరి ఆకాంక్షించారు.
ఇటీవల ఆమె ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం పలికి స్వామి వారి శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.