మానకొండూరులో చెట్టుపైకి ఎక్కి ఎలుగుబంటి దోబూచులాట - పట్టుకునే లోపే పరారైన భల్లూకం - Bear In Karimnagar
Published : Feb 6, 2024, 11:03 AM IST
|Updated : Feb 6, 2024, 2:23 PM IST
Bear in Karimnagar : కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది. తెల్లవారుజామున ఇళ్లలోకి వస్తున్న భలుకాన్ని చూసి కుక్కలు తరమడంతో సమీపంలోని చెట్టుపైకి ఎక్కింది. గమనించిన స్థానికులు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. భల్లూకం చెట్టుపైకి ఎక్కడంతో పెద్దసంఖ్యలో స్థానికులు అక్కడకి తరిలివచ్చారు. జనాన్ని చూసి ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉందని గమనించిన పోలీసులు చుట్టు పహారా ఏర్పాటు చేశారు. స్థానికుల అటుగా రాకుండా చర్యలు చేపట్టారు. ఎలుగుబంటి భయపడి చిటారు కొమ్మల్లోకి ఎక్కడంతో పడిపోతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.
Bear in Manakondur : ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా వలలు ఏర్పాటుచేశారు. వరంగల్ నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని అటవీశాఖ సహాయ సిబ్బందిని రప్పించారు. మత్తుఇంజిక్షన్ ఇచ్చి కిందకు తీసుకురావాలని నిర్ణయించారు. ఇంజిక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నస్తుడంగా ఎలుగుబంటి చెట్టుపై నుంచి దిగి పరారైంది. సమీపంలోని పొదల్లోకి వెళ్లడంతో గాలింపు చేపట్టిన అటవీ శాఖ సహాయ సిబ్బంది మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు.
కరీంనగర్ శివారుప్రాంతాల్లో పెద్దఎత్తున గ్రానైట్ క్వారీలుండటంతో పెద్దమొత్తంలో పేలుళ్లు చేస్తున్నారు. ఆ పేలుళ్లకి భయపడతున్న ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వస్తున్నాయి. కరీంనగర్‌తో పాటు శాతవాహన వర్సిటీలో పలుసార్లు బల్లుకాన్ని గమనించిన అటవీశాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకొని అడవులకి తరలించారు. మరోసారి ఎలుగుబంటి రావడంతో స్థానికులు ఆందోళన చెందారు.