LIVE : హైదరాబాద్లో బతుకమ్మ సంబరాలు - ప్రత్యక్ష ప్రసారం
Published : Oct 7, 2024, 7:02 PM IST
|Updated : Oct 7, 2024, 7:54 PM IST
Bathukamma Celebrations in Hyderabad Live : నవరాత్రులు అనగానే ఆడ పిల్లలకు పెద్ద సంబరం. ఒకవైపు అమ్మవారి పూజలు మరోవైపు బతుకమ్మ. హైదరాబాద్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడి పాడుతున్నారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా చౌరస్తాలన్నీ బతుకమ్మలతో, ఆడపడుచులతోనూ మురిసిపోయాయి. మహిళామణుల పండుగగా పిలుచుకోనే బతుకమ్మలో సందడిగా ఆడిపాడుతున్నారు. తీరొక్క పూలతో అందంగా తీర్దిదిద్దిన బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడి పాడుతున్నారు. కోలాలతో ఆడుతున్నారు. తెలంగాణలో మహిళలకు మహా ఇష్టమైన పండుగ బతుకమ్మ వేడుక. ఆదిపరాశక్తిని అరవిరిసిన సుమాల్లో దర్శిస్తూ, పాటలతో ప్రస్తుతిస్తూ పరవశించిపోతారు. 9 రోజుల ఈ వేడుకలో తంగేడు, జిల్లేడు, గునుగు, బంతి, చేమంతి ఇలా ఎన్నెన్నో కుసుమాలు ఈ పండుగ కోసమే పూశాయా అనిపిస్తాయి. బతుకమ్మ పండుగను ఆధ్యాత్మిక సాధకులు సామూహిక 'శక్తి ఉపాసన'గా, ఆత్మచైతన్యానికి మేల్కొలుపుగా భావిస్తారు. బతికించే అమ్మ' అనే ఆరాధనా భావంతో అమ్మవారికి నీరాజనాలు అర్పించటం బతుకమ్మ పండుగలో అంతరార్థం. ఆరోగ్యకర జీవనం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అమ్మను వేడుకోవటం ఆనవాయితీ.
Last Updated : Oct 7, 2024, 7:54 PM IST