చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రావీణ్యం కలిగి ఉండడం మంచిది : పారుపల్లి కశ్యప్ - HAMSTECH COLLEGE SPORTS MANIA 2024
Published : Sep 29, 2024, 10:04 PM IST
HAMSTECH COLLEGE SPORTS MANIA 2024 : క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమిని గెలుపునకు తొలిమెట్టుగా భావించి ముందుకు సాగాలని బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ అన్నారు. ఇవాళ కూకట్‌పల్లిలోని హ్యామ్స్‌టెక్ కాలేజీ నిర్వహించిన స్పోర్ట్స్ అన్యువల్ మానియా 2024 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. పలు విభాగాలలో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రావీణ్యం కలిగి ఉండడం మంచిదని ఆయన పేర్కొన్నారు. తాను గెలుపు కంటే ఓటమిలను ఎక్కువ చూశానని తెలిపారు.
శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉండేండుకు క్రీడలు అవసరం అన్నారు. విద్యార్థులందరూ మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టిసారించాలని తెలిపారు. వీడియో గేమ్‌లు కాకుండా అవుట్‌డోర్ గేమ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. విద్యార్థులందరూ శారీరకంగా ఆరోగ్యంగానే ఉంటేనే మానసికంగా దృఢంగా ఉంటారని వెల్లడించారు. చదువులో రాణించాలంటే మానసిక ఆరోగ్యానికి, శారీరక శ్రమతోనే సాధ్యమన్నారు. చదువుతో పాటుగా తమకు ఇష్టమున్న క్రీడవైపు దృష్టిసారించాలని, తల్లిదండ్రులు సైతం విద్యార్థులను క్రీడలు ఆడేలా ప్రోత్సహించాలని తెలిపారు.