భీమవరంలో సీఎం బస్సు యాత్ర - రోడ్డుకు ఇరువైపులా చెట్లు తొలగింపు - CM Jagan Tour Trees Cuts - CM JAGAN TOUR TREES CUTS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 2:47 PM IST
Authorities Remove Trees During CM Jagan Meeting: సీఎం జగన్ పర్యటన అంటే పోలీసులు, అధికారులు హడావుడి మామూలుగా ఉండటం లేదు. ముఖ్యమంత్రి వస్తున్నారంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు కొట్టేయడం, ట్రాఫిక్ మళ్లించడం, విద్యుత్ తీగలు తొలగించడం రివాజుగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఇవాళ మేమంతా సిద్ధం సభ జరగనుంది. సీఎం బస్సు యాత్ర జరిగే భీమవరం ప్రధాన మార్గంలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లను వేళ్లతో సహా పెకలించేశారు.
అంతే కాకుండా విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లను సైతం తొలగించేశారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి ప్రజలు ఇ్బబందులు పడుతున్నారు. అసలే ఎండాకాలం రోడ్డుకు ఇరువైపులా ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న చెట్లను అధికారులు తొలగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వస్తున్నారంటే చాలు వాహనదారులకు ట్రాఫిక్ ఆంక్షలతో తిప్పలు తప్పడం లేదు. సీఎం జగన్ సభ ఎక్కడ ఉంటే అక్కడికి బస్సులను తరలించడంతో ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందరో ముఖ్యమంత్రులు పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసినప్పటకీ ఇంతటి విధ్వంసం ఎవరూ చేయలేదని ప్రజలు మండిపడుతున్నారు.