ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మీ పరిపాలన సాగాలి: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల - Sharmila Open Letter To Chandrababu - SHARMILA OPEN LETTER TO CHANDRABABU
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 13, 2024, 8:34 AM IST
APCC President Sharmila Open Letter To Chandrababu Naidu : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. సీఎం సహా ప్రమాణం చేసిన పవన్ కల్యాణ్ కు, రాష్ట్ర కేబినెట్ ను అభినందిస్తూ బహిరంగ లేఖ రాశారు. చారిత్రాత్మకమైన మెజార్టీతో అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా నిలవాలని షర్మిల కోరారు. సభ్య సమాజంలో పగలు, ప్రతీకారాలకు చోటు లేకుండా చూడాలని తీవ్రమైన సవాళ్లను పరిష్కరించటంతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణాన్ని వేగంగా చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్ర ప్రగతికి అందివచ్చే అవకాశాలకు ఇబ్బంది కలుగుతుందని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. గడిచిన ఐదేళ్లలో జరిగిన విశృంఖల పాలన, దానివల్ల జరిగిన నష్టాలు తెలిసినందున రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలని ఆకాంక్షించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా నిష్పాక్షికంగా పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిందిగా ఆభ్యర్థిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో లేఖను పోస్ట్ చేశారు. రాష్ట్రాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు