How To Link Credit Card To UPI : దేశంలో యూపీఐ సేవలు ఓ రేంజ్‌లో విస్తరిస్తున్నాయనే చెప్పాలి. డిజిటల్ చెల్లింపులకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. టీ షాప్ నుంచి పెద్ద పెద్ద దుకాణాల వరకు యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్రెడిట్ కార్డులను యూపీఐకి లింక్ చేసుకునే అవకాశాన్ని ఆర్‌బీఐ ఇటీవల కల్పించింది. అయితే క్రెడిట్ కార్డును యూపీఐతో ఎలా లింక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యూపీఐ పేమెంట్స్ అంటే కేవలం మన సేవింగ్స్ ఖాతాలో ఉన్న నగదుతో లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డును కూడా యూపీఐ యాప్‌కు లింక్ చేసుకునే అవకాశాన్ని ఇటీవల కల్పించడం వల్ల చిన్న చిన్న మొత్తాలకూ క్రెడిట్ కార్డు వినియోగం పెరుగుతోంది. బిల్ పేమెంట్ తేదీ వచ్చిన తర్వాత కార్డులో చెల్లింపులు చేస్తే సరిపోతుంది. అయితే ఈ విధానం కేవలం రూపే క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ కార్డులను మాత్రమే యూపీఐ యాప్‌కు లింక్ చేసుకొని క్రెడిట్ కార్డు నుంచి పేమెంట్స్ చేసుకోవచ్చు.
ఎలా లింక్ చేసుకోవాలంటే?
- ముందుగా యూపీఐ పేమెంట్ యాప్‌ను ఓపెన్ చేయాలి
- ఎడమ వైపు కనిపించే త్రీ డాట్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి
- పేమెంట్స్ మెథడ్స్ ఆప్షన్‌లోకి వెళ్లాలి
- రూపే క్రెడిట్ ఆన్ యూపీఐ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి
- వెంటనే బ్యాంకుల వివరాలు కనిపిస్తాయి
- మీ రూపే క్రెడిట్ కార్డు జారీ చేసిన బ్యాంకును సెలక్ట్ చేసుకోవాలి
- మీ కార్డు వివరాలు వచ్చేస్తాయి. ఇలా కార్డును యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో పేమెంట్ చేసే సమయంలో క్రెడిట్ కార్డు ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే చెల్లింపులు ఈజీగా చేయవచ్చు. మీ క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ నుంచి పేమెంట్ కట్ అవుతుంది.
నోట్ : బ్యాంక్ ఖాతాలో నగదు లేకపోయినా క్రెడిట్ కార్డులను వినియోగించుకునే వీలుండడం వల్ల కొనుగోళ్లపై నియంత్రణ తగ్గి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తద్వారా అనవసరంగా రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రతగా వ్యవహరించాల్సిందే!