Public in Queue for Biryani : బిర్యానీ ఆ మాట వినగానే అందిరికీ నోరూరుతుందంటే అతిశయోక్తి కాదు. సీజన్ ఏదైనా దీని హవా ఏమాత్రం తగ్గదు. ఫంక్షన్, పార్టీ ఏదైనా, గెస్ట్లు ఎవరైనా బిర్యానీ మస్ట్! వంట చేయడానికి బద్ధకంగా అనిపించినప్పుడు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలనుకున్నప్పుడు మొదటగా గుర్తొచ్చేది ఇదే! అంతలా భారతీయుల జీవనశైలిలో భాగమైపోయింది. పండగలు, ప్రత్యేక వేడుక రోజుల్లో బంధు మిత్రులు కలిసి దీన్ని ఆరగిస్తారు. బిర్యానీ క్రేజ్ అంటే అదే మరీ.
మరి ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేస్థాయిలో నగరంలో వాడవాడలా బిర్యానీ సెంటర్లు వెలిశాయి. వినియోగదారులను ఆకట్టుకునేలా నిర్వాహకులు వివిధ రకాల పేర్లతో వీటిని ప్రజలకు పరిచయం చేస్తున్నారు. సాధారణ రోజుల్లోనే నగర వాసులు వీటిని ఎక్కువగా ఆర్డర్ చేస్తారు! అలాంటిది నూతన సంవత్సర వేడుకలు అంటే అమ్మో! మరి ఇక ఆగుతారా చెప్పండి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనైనా బిర్యానీ తినాల్సిందే అని అనుకున్నారేమో కాబోలు పార్శిళ్ల కోసం ప్రజలు హోటళ్లకు క్యూ కట్టారు. మరికొంత మంది ఆన్‌లైన్‌లో ఆర్డర్లు చేశారు.
ఈ క్రమంలోనే బిర్యానీ కోసం సుచిత్ర చౌరస్తాలోని ఓ రెస్టారెంట్ వద్ద బిర్యానీ ప్రియులు, ఫుడ్ డెలివరీ బాయ్స్ అర కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఇది చూసిన జనాలు ఏంటీ బిర్యానీ కోసం ఇంత పెద్ద క్యూలైనా అంటూ ముక్కున వేలేసుకున్నారు. న్యూ ఇయర్ అప్పుడు సెలబ్రేషన్స్ మానేసి అందరూ ఇక్కడే ఉన్నారుగా అని కొందరు చమత్కరించారు. ఏదేమైనా హైదరాబాద్ వాసులు మాత్రం మరోసారి బిర్యానీ ప్రియులని మాత్రం నిరూపించుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Biryanis Orders in Hyderabad : మరోవైపు ఇటీవల స్విగ్గీ విడుదల చేసిన నివేదికలో హైదరాబాదీలు నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నారు. ఈ లెక్క దేశంలోనే అత్యధికం. సంవత్సర కాలంలో ఏకంగా 1.57 కోట్ల ప్లేట్ల బిర్యానీలను ఆరగించారు మనోళ్లు. మధ్యాహ్నం, రాత్రి మాత్రమే కాదు, ఏకంగా తెల్లవారుజామున 4 గంటలకూ బిర్యానీల ఆర్డర్ ఇస్తున్న వారూ ఉన్నారు.