Inter Mid Day Meal Scheme in AP : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకూ నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. సర్కార్ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల మెరుగుదలకు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి ప్రారంభం కానుంది.
దీని వల్ల 1,48,419 మంది విద్యార్థులకు భోజనం అందనుంది. విజయవాడ పాయకాపురం నుంచి మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పాల్గొంటారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 398 కాలేజీలు సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ వాటికి భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది రూ.27 కోట్లు, వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85 కోట్లు ఖర్చు చేయనున్నారు.
నిత్యాన్నదాత డొక్కా సీతమ్మ - మధ్యాహ్న భోజన పథకానికి స్ఫూర్తి ప్రదాత పేరు
అర్ధాకలితో విద్యార్థులు విద్యాభ్యాసం : మరోవైపు ఏపీలో చాలా మంది విద్యార్థులు రోజూ ఉదయం 8 గంటలకు బయల్దేరి చాలా దూరం ప్రయాణించి కాలేజీకి చేరుకుంటారు. కొన్నిసార్లు ఇంట్లో వీలు కుదరకపోవడం, వెంట తెచ్చుకున్న క్యారేజీ మధ్యాహ్నానికి పాడవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇలా ఒకటి, రెండు ప్రాంతాలు కాదు రాష్ట్రం మొత్తం మీద వివిధ జూనియర్ కళాశాలల్లో ఈ సమస్య ఉంది.
విద్యార్థులు ఉదయాన్నే బయలుదేరడం వల్ల కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు వేరే పనులకు వెళ్లడం వల్ల సకాలంలో క్యారియర్ కట్టలేకపోతున్నారు. పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థులది మరో సమస్య. వీరందరికి మధ్యాహ్న భోజనం అవసరం ఉంది. టీడీపీ ప్రభుత్వం 2019 వరకు అమలు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని జగన్ సర్కార్ పక్కన పెట్టేసింది. దీంతో అర్ధాకలితో వారు విద్యాభ్యాసం చేసేవారు.
Dokka Seethamma Mid Day Meal in AP : ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రభుత్వ జానియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇవాళ దీనిని ప్రారంభించనుంది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు వరం - జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం
Mid day Meal Workers Protest: మూడు వేల జీతం.. గ్యాస్ సిలిండర్లకే సరిపోతోంది.. మేము ఎట్లా బతికేది?