ANNADANAM IN TIRUMALA : తిరుమల అనగానే వేంకటేశ్వరస్వామి, చెవులకు ఇంపుగా వినిపించే గోవిందనామాలు గుర్తొస్తాయి. ఆ తర్వాత లడ్డూ, అన్నప్రసాదం అంటే భక్తులకు ఎంతో ఇష్టం. శ్రీవారి దర్శనం కోసం ఎన్నాళ్లుగానో వేచి చూస్తూ దేశ, విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. నిత్యం లక్షలాది మంది భక్తులకు లడ్డూలతో పాటు రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు టీటీడీ అందిస్తుంది. ఈ నేపథ్యంలో భక్తులకు సైతం ఆ మహద్భాగ్యాన్ని కల్పిసూ టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక్క రోజు అన్నప్రసాద విరాళ పథకం ప్రారంభించింది.
అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని పండితులు చెప్తుంటారు. ఆకలితో అలమటించే వారికి కడుపు నింపడం సాక్షాత్తూ దైవ సేవతో సమానమని అంటుంటారు. అందుకే పూజాది హోమ కార్యక్రమాల్లో అన్నదానానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు. అన్నదానం చేయడాన్ని దైవ సేవగా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో అన్నదానానికి అవకాశం దొరికితే వదులుకుంటారా?
దర్శనం టికెట్ బుక్ చేసుకుని వెళ్లకపోతే మరో అవకాశం? - టీటీడీ ఈవో ఏమన్నారంటే!
టీటీడీ నిత్యం 2.5లక్షల మందికి అన్న ప్రసాదం అందిస్తోంది. ప్రస్తుతం కొండపై మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్లు, పీఏసీ-4(పాత అన్నప్రసాదం), పీఏసీ-2లో అన్నదానం జరుగుతుంది. అదే విధంగా కొండ కింద తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, రుయా ఆసుపత్రి, స్విమ్స్, తిరుచానూరులో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
ఇక తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలోనూ అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు. టీటీడీ అన్న ప్రసాద విభాగం తిరుమల, తిరుపతిలో రోజుకు దాదాపు రెండున్నర లక్షల మందికి అన్న ప్రసాద వితరణ (టీ, కాఫీలు, పాలు కలిపి) చేస్తోంది.
లక్షలాదిగా తరలి వచ్చే భక్తులు ఆకలితో బాధపడకుండా చేపట్టిన ఈ అన్నప్రసాదంలో పాలు పంచుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ చేయాలనుకునే భక్తులు రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఉదయం అల్పాహారం కోసం 10 లక్షల రూపాయలు అందించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు చెల్లించాలి. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శించడంతో పాటు దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది.