World Cancer Day 2025 : ఏపీలో క్యాన్సర్ అనుమానిత కేసులను వైద్యఆరోగ్యశాఖ గుర్తిస్తోంది. గత నెల నుంచి ఇప్పటివరకు 74,23,180 మందిని వైద్య సిబ్బంది పరీక్షించారు. అందులో 71,772 మందిలో అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. 29,091 మందిలో నోటి క్యాన్సర్, 20,461 మందిలో రొమ్ము, 22,220 మందిలో గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు కనిపించాయని సీహెచ్‌ఓలు, ఏఎన్‌ఎంలు అసాంక్రమిక వ్యాధుల సర్వే-3 ద్వారా రికార్డుల్లో తెలిపారు.
వీరిలో 31,000ల మందికి వైద్యాధికారుల ద్వారా మళ్లీ పరీక్షలు నిర్వహించారు. ఖరారైన కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ తుది నిర్ధారణకు ఇంకొంత సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రకారం 2023-2024లో ఏపీలో 73,000ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అందులో సర్వెకల్, బ్రెస్ట్ కేసులు 55 శాతం వరకు ఉన్నాయి. మిగిలిన 45 శాతం కేసుల్లో ప్రోస్ట్రేట్, బ్లడ్, బ్రెయిన్, ఇతర క్యాన్సర్లున్నాయి. వీటి బారినపడి 40,000ల మంది మరణించారు. నమోదయ్యే కొత్త కేసులు, సంభవించే మరణాల్లో 40 శాతం నుంచి 50 శాతం వరకు స్వీయ జాగ్రత్తలతో నిరోధించదగినవేనని ప్రభుత్వ సీనియర్ వైద్య నిపుణులు వివరించారు. సర్వే ద్వారా మహిళల్లోనూ అవగాహన వస్తుందని, ఇళ్లకు వచ్చే ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని సూచిస్తున్నారు.
3, 4 దశల్లో వస్తున్నారు : క్యాన్సర్ బాధితులు 3, 4 దశల్లో ఆసుపత్రులకు వస్తున్నారని గుంటూరు జీజీహెచ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జాహ్నవి తెలిపారు. రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్లను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స అందిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. ఇతర అనారోగ్యాలతో ఆసుపత్రులకు వెళ్లినప్పుడు రోగులకు క్యాన్సర్ బయటపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆహారాన్ని మింగడం, ద్రవాలను తాగడంలో వచ్చే ఇబ్బందులను అన్నవాహిక, జీర్ణాశయం, గొంతు క్యాన్సర్లకు సంకేతాలుగా భావించాలని వివరించారు. దీనిని త్వరగా గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని ఆమె వెల్లడించారు.
పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి : పిల్లలకు జ్వరం ఎంతకీ తగ్గకున్నా, కంటిలో తెల్ల చుక్కలు ఎక్కువకాలం ఉన్నా, శరీరం కందిపోయినట్లు, వాలిపోయినట్లు కనిపించినా వైద్యులను సంప్రదించాలని పీడీయాట్రిక్ హెమటో అంకాలజిస్ట్ డాక్టర్ అక్కినేని వీణ పేర్కొన్నారు. రెండేళ్ల నుంచి పదేళ్ల మధ్య వయసున్న వారిలో లుకేమియా ఎక్కువగా కనిపిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్‌లోనే పిల్లల్లో వచ్చే క్యాన్సర్ల సంఖ్య 25 శాతం వరకు ఉందని వీణ తెలిపారు.
స్థూలకాయం పెనుప్రమాదం : స్థూలకాయంతో క్యాన్సర్ వ్యాధులు పొంచి ఉంటాయని గుంటూరు మెడికల్ ఆంకాలజీ ప్రొఫెసర్, డాక్టర్ పీవీ శివరామకృష్ణ వివరించారు. పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. శరీరంలో అనూహ్యంగా మార్పులను గుర్తిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఒకవేళ క్యాన్సర్ అని తేలితే ఆందోళన చెందొద్దని కీమో, రేడియేషన్, హార్మోన్, ఇమ్యునోథెరపీ, బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి అత్యాధునిక చికిత్సలతో రోగులు కోలుకొనే అవకాశాలు మెండుగా ఉంటాయని వెల్లడించారు.
అలర్ట్ - ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు - రోగుల్లో వారే అత్యధికం
విజృంభిస్తున్న 'మహమ్మారి' - మీలో ఈ లక్షణాలు ఉన్నాయా - జాగ్రత్త పడండి