'వివేకం' సినిమా నిలుపుదల చేయాలని హైకోర్టులో దస్తగిరి పిటిషన్ - విచారణ ఎల్లుండికి వాయిదా - DASTAGIRI PETITION ON VIVEKAM MOVIE - DASTAGIRI PETITION ON VIVEKAM MOVIE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 2, 2024, 4:38 PM IST
AP High Court on Dastagiri Petition: వివేకం సినిమా నిలిపివేయాలంటూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో అతని పేరు ఉదహరించడంపై దస్తగిరి అభ్యంతరం వ్యక్తం చేశాడు. పులివెందుల నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారణంగా ఈ విధమైన సినిమా ప్రదర్శించబడటం తన హక్కులకు భంగం కలిగిస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినపించారు. ఎన్నికలు ముగిసే వరకు సినిమా నిలిపివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ నుంచి వివరణ తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. వివరణ తీసుకునేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది.
ఇక సినిమా విషయానికి వస్తే, వివేకా హత్య జరిగే నాటికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి అధికార దాహం, తన సొంత బాబాయ్ వివేకా హత్యకు ఎలా దారి తీసింది? సీఎం కుర్చీ మీద జగన్మోహన్ రెడ్డి పాత్రధారికి ఉన్న మోహం రక్త సంబంధాన్ని ఎలా బలి తీసుకుంది? వివేకాపై గొడ్డలి వేటు వేయడానికి కుట్ర ఎక్కడ ప్రారంభమైంది? ఆ కుట్రను ఎవరెవరు అమలు చేశారు ? వారి వెనక ఎవరెవరు ఉన్నారు ? ఇలా వివేకా హత్య కేసు ఆధారంగా అనే అంశాలను ‘వివేకం’ సినిమాలో చూపించారు. సీబీఐ ఛార్జిషీట్‌లోని అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ గత కొంత కాలంగా ప్రాచుర్యం పొందిన ప్రశ్న ద్వారా మొదలుపెట్టి ఈ చిత్రంలో వివేకా హత్యకు దారి తీసిన పరిణామాలను చూపించారు.