ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి - అర్హులందరూ ఓటు వేయాలని పిలుపు - CEO tweet for ugadi festival - CEO TWEET FOR UGADI FESTIVAL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 9:36 PM IST
AP CEO Mukesh Kumar Meena Wished to People For Ugadi Festival : రాష్ట్రప్రజలకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శాంతి శ్రేయస్సు, సామరస్యాలతో నిండిన సంవత్సరానికి నాందిపలుకుదామంటూ ఆయన 'ఎక్స్'లో ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దప్రజాస్వామ్య వేడుకను అంతా కలిసి జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఈమేరకు ఓటర్లతో కూడిన ముఖచిత్రాన్ని ఉగాది శుభాకాంక్షలతో జత చేసి ట్వీట్ చేశారు. శుభ సంవత్సరంలో తప్పకుండా అందరూ ఓటు వేసేందుకు ప్రతిజ్ఞ చేద్దామంటూ ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. మే 13 తేదీన రాష్ట్ర ప్రజలంతా ఓటింగ్లో పాల్గోనాలని పేర్కొన్నారు.
అయితే రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ముఖేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు పర్యావేక్షిస్తున్నారు. ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచితాల పంపిణీ కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచిస్తున్నారు. అందుకోసం చెక్ పోస్టుల వద్ద తనిఖీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. మరోవైపు ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎవరైనా తమకు నేరుగా కూడా అందించొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికే స్పష్టం చేశారు.