తిన్న ఇంటికి కన్నం వేయడం అంటే ఇదే - stealing from owners house - STEALING FROM OWNERS HOUSE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 8, 2024, 10:55 PM IST
Accused of Stealing From Owners House in Sri Sathya Sai District : ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేరు అంటారు. కానీ శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన పోలీసులు కొన్ని గంటల్లోనే పట్టుకొని అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. వివరాలల్లోకి వెళ్తే, మిత్రులతో కలిసి యజమాని ఇంట్లోనే చోరీ పాల్పడిన నిందితులను శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కదిరి పట్టణంలో మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్న మధుసూదన్ వద్ద షేక్ హైదర్ వలీ పది సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. మెడికల్ స్టోర్ యజమాని ఈనెల 5న వ్యక్తిగత పనిమీద బెంగుళూరు వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన హైదర్ వలీ తన మిత్రులతో కలిసి యజమాని ఇంట్లో చోరీకి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. యజమాని భార్య కళ్యాణి మెడికల్ స్టోర్‌లో ఉన్న సమయంలో హైదర్ వలీ తన మిత్రులు ఆల్తాఫ్, మహేష్‌ను తన యజమాని ఇంట్లోకి పంపారు.
అనంతరం బీరువాలోని 11 లక్షల రూపాయలు, ఒకటిన్నర కిలో వెండి వస్తువులను అపహరించుకు వెళ్లారు. బెంగుళూరు నుంచి వచ్చిన యజమాని మధుసూదన్ బీరువాలోని నగదు, వెండి వస్తువులు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా హైదర్ వలీని విచారించగా అసలు నిజం బయట పడింది. అనంతరం హైదర్ వలీ, ఆల్తాఫ్, మహేష్, ఖాజా పీరాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి చోరిచేసిన సొత్తును రికవరీ చేసుకున్నారు. చోరీ జరిగిన రెండు రోజులలోనే కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.