కుళాయి దొంగను పట్టించిన వాట్సాప్ గ్రూప్ - ఖాకీలకే మస్కా కొట్టి ఠాణా నుంచి పరార్ - Thief Escapes From Police Station - THIEF ESCAPES FROM POLICE STATION
Published : Aug 2, 2024, 11:38 AM IST
Thief Escapes From Police Station : పోలీసులకే మస్కా కొట్టి ఓ దొంగ ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడు. పరారైన దొంగను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ఈ ఘటన హైదరాబాద్ యూసుఫ్‌గూడ పరిధిలో జరిగింది. దుండగుడు చోరీలకు పాల్పడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
పోలీసుల కథనం ప్రకారం యూసుఫ్‌గూడ సమీపంలోని యాదగిరినగర్‌లో ఇటీవల కాలంలో ఇళ్లలోని కుళాయిలు చోరికి గురవుతున్నాయి. అనుమానం వచ్చి స్థానికులు దగ్గర్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ఓ దొంగ నల్లాలను కాజేస్తున్నట్లుగా కనిపించింది. ఈ వీడియోలు కాస్త బస్తీ కమిటీ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారు.
ఈ వీడియోలు చూసి అప్రమత్తమైన స్థానికులు.. దొంగ బుధవారం రోజున ఓ ఇంట్లో చొరబడి ట్యాప్‌ను ఊడదీసీ చోరీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అలా మధురానగర్ ఠాణాలో ఉన్న ఆ దొంగ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. తప్పించుకున్న నిందుతుడి పేరు వికాస్ అని, అతడు నేపాల్ వాసి అని పోలీసులు తెలిపారు. దొంగ పరారవ్వడంతో వెంటనే పెట్రోలింగ్, బ్లా కోల్డ్స్ పోలీసుల్ని అప్రమత్తం చేసి వెదికినా నిందితుడి జాడ లభ్యం కాలేదు.