ప్రభుత్వాస్పత్రిలో '3 ఇడియట్స్' సీన్ రిపీట్!- ఎమర్జెన్సీ వార్డులోకి బైక్‌తో డైరెక్ట్ ఎంట్రీ - mp hospital 3 idiots scene
Published : Feb 11, 2024, 7:55 PM IST
3 Idiots Bike Scene In Hospital Viral Video : స్పృహలో లేని తన తండ్రిని బైక్ వెనుకవైపు వేరే వ్యక్తి సాయంతో కూర్చోబెట్టి నేరుగా ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. మధ్యప్రదేశ్‌లో సత్నా జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన, సూపర్ హిట్ త్రీ ఇడియట్స్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించిందని అక్కడి వారు తెలిపారు.
శనివారం రాత్రి నీరజ్ గుప్తా అనే వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. స్పృహలో లేని ఆయనను నీరజ్ గుప్తా కుమారుడు మరో వ్యక్తి సాయంతో ద్విచక్రవాహనంపై కూర్చోపెట్టి ఆస్పత్రికి బయలుదేరాడు. నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి బైక్‌తో సహా తీసుకెళ్లారు. అనంతరం పేషంట్‌ను ఎమర్జెన్సీ వార్డులో దింపి ద్విచక్ర వాహనాన్ని ఆస్పత్రి బయట పార్క్ చేశారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ సెక్యురిటీ గార్డ్ రికార్డ్ చేశారు.
అయితే ఈ ఘటనపై చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎల్‌కే తివారీ స్పందించారు. ఈ విషయం మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో వార్డుల వారీగా సెక్యూరిటీ గార్డులు ఉన్నారని, పేషెంట్లను స్ట్రెచర్లు మీద తరలించేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.