Zomato Decides to Change Its Name: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. తన పేరును 'ఎటర్నల్'గా మార్చుకునేందుకు నిర్ణయించింది. కంపెనీ బోర్డ్ కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు కంపెనీ ఫిబ్రవరి 6న స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
జొమాటో గ్రూప్ CEO అండ్ కో-ఫౌండర్ దీపిందర్ గోయల్ BSEకి దాఖలు చేసిన లేఖలో "మేము బ్లింకిట్‌ను కొనుగోలు చేసినప్పుడు కంపెనీ, బ్రాండ్/యాప్ మధ్య తేడాను గుర్తించేందుకు అంతర్గతంగా జొమాటోకు బదులుగా 'ఎటర్నల్' అని ఉపయోగించడం ప్రారంభించాము. జొమాటోకు మించి ఏదో ఒక వ్యాపారం మా భవిష్యత్తుకు ముఖ్యమైనగా మారిన రోజు మేము కంపెనీ పేరును పబ్లిక్‌గా 'ఎటర్నల్' అని మార్చాలని అనుకున్నాము. ఈరోజు బ్లింకిట్‌తో మేము అనుకున్న స్థాయికి చేరుకున్నామని భావిస్తున్నాము. ఇదే సరైన సమయమని భావించి ఇప్పుడు కంపెనీ పేరును జొమాటో లిమిటెడ్ నుంచి ఎటర్నల్ లిమిటెడ్ (Not The Brand and App)గా మార్చాలనుకుంటున్నాం" అని పేర్కొన్నారు.
ఇకపోతే మన దేశంలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థల్లో జొమాటో ఒకటి. ఇది ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన కొద్ది నిమిషాల్లోనే మనకు కావాల్సిన రెస్టారెంట్ నుంచి నచ్చిన ఫుడ్ తీసుకొస్తుంది. దీంతో మంచి ప్రజాదరణతో దూసుకుపోతున్న ఈ కంపెనీ ఇటీవల తన సేవలను విస్తరించడంలో భాగంగా బ్లింకిట్‌ను ప్రారంభించింది. ఇది కూడా మంచి పాపులారిటీని సొంత చేసుకోవడంతో క్విక్ కామర్స్ రంగంలో సైతం ఈ సంస్థ దూసుకుపోతోంది.
ఎటర్నల్ అంటే ఏంటో తెలుసా?:జొమాటో తన కంపెనీ పేరును మార్చుకున్నఎటర్నల్ అనే పదం లాటిన్ అండ్ ఇటాలియన్ నుంచి వచ్చింది. తెలుగులో దీనికి అమరత్వం, శాశ్వతమైనది లేదా నిత్యమైనది అని అర్థం. అంటే చావు లేనిది అని.
జొమాటో స్టాక్:గురువారం NSEలో జొమాటో షేరు 1.22 శాతం పడిపోయి రూ.229.90 వద్ద ముగిసింది. అయితే గత ఐదు సెసన్ష్లో ఈ వాటా 5శాతం పెరగడం విశేషం. ఈ ఏడాది ఇప్పటివరకు జొమాటో షేర్లు 16 శాతానికి పైగా పడిపోయాయి. వచ్చే నెలలో జొమాటో NSE మెయిన్ ఇండెక్స్ నిఫ్టీలో చేరనుంది.